మొత్తం పేజీ వీక్షణలు

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఓం బ్లాగ్ గణపతియై నమః

ఓం బ్లాగ్ గణపతియై నమః




ఏమిటి స్వామీ అలా చూస్తున్నావు? కొత్తగా పిలిచాననా? ఏం చెయ్యను? ఒక్కొక్కరూ నిన్ను ఒక్కో రకంగా కాకాపడుతున్నారు. ఎవరెవరో నిన్ను హనుమంతునిమీద, ఎద్దుమీద, హంసమీద ఇంకా తనకి
నచ్చిన జంతువులన్నిటిమీదా ఊరేగిస్తున్నారు. బాగా డబ్బున్నవాల్లేమో నోట్లకట్టలతో అలంకరించి నిన్ను లక్ష్మీగణపతి అంటున్నారు. నువ్వేమో అందరికీ బదులు పలుకుతున్నావుగాని నాకు మాత్రం బదులు
పలకట్లేదు. బహుశా నీకు కొత్తదనం అంటే ఇష్టమేమో అని నేను కూడా ఇలా ప్రయతించాను. నచ్చకపోతే క్షమించు. మా హీరోల తెలుగు డిక్షనరీల్లో ఈ మాట ఉండదేమో కాని, నీ నిఘంటువులో తప్పకుండా
ఉంటుంది. ఎంతైనా భోళా శంకరుని కుమారుడివి కదా. జీన్స్ ఎక్కడికి పోతాయి చెప్పు?!

అయినా ఇన్ని రూపాల్లో దర్శనమిచ్చే నువ్వు మా బ్లాగుల కోసం బ్లాగ్ గణపతిగా వెలిస్తే తప్పేమిటి? మా బ్లాగులకేం తక్కువ? నువ్వు రాసిన మహాభారతం లో ఎన్ని రకాల మనుషులున్నారో మా బ్లాగర్లలో
అన్ని రకాల జనాలూ ఉన్నారు. వ్యాసుని భారతాన్ని నువ్వు అర్థం చేసుకున్నంత సులువుగా ఈ బ్లాగు భారతాన్ని మేం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎవరు ఏ రకమో ఓ పట్టాన అర్థం అవదు. అందులోనూ మా బ్లాగుభారతం లో శల్యులూ శకునులూ ఎక్కువ. మన తరపు ఉన్నట్లుగానే ఉంటారుగానీ సమయం చూసి మనల్ని గోతిలో తోసేస్తారు.

బ్లాగ్ గణపతిగా నీ ఆశీర్వాదం లేకపోతే నా బ్లాగు నిలబడగలదా చెప్పు? విఘ్నాలకి అధిపతివి. ఒక బ్లాగును బ్లాక్ చేయించాలన్నా బ్లాక్-బస్టర్ చేయించాలన్నా నీకు చిటికెలో పని. అన్నట్లు నీ కథలో మూషికాసురుడు ఒక్కడే అయితే మా బ్లాగు వెతల్లో అనానిమాసురులు కోకొల్లలు. ఎవరు ఎపుడు ఎలా దాడిచేస్తారో తెలియదు. అందుకే నీ ఆశీర్వాదం ఇవ్వు స్వామీ. నా బ్లాగు వేసవిలో చల్లగా.. చలికాలంలో నులివెచ్చగా ఉండేట్లు ఆశీర్వదించు. నీకు ఉండ్రాల్లు నైవేద్యం పెట్టలేనుగాని నాకు ఉండ్రాల్లంతే ఎంత ఇష్టమో చెప్తూ ఒక పోస్టు రాయగలను!! ఏమిటి స్వామీ మాట్లాడట్లేదు? తెలంగాణా యాసలో బదులివ్వాలా లేక ఉత్తరాంధ్రయాసలో చెప్పాలా లేక సీమ యాసలో వీడికి గడ్డిపెట్టాలా అని ఆలోచిస్తున్నావా? నాకలాంటి ప్రాంతాల పట్టింపులు లేవు స్వామీ. నేను నీ ఫాన్ ని గాని, ఏ మహానేతకో యువనేతకో హైటెక్కు బాబుకో తెలుగురాని ముఖ్యమంత్రికో ముక్కన్నకో చెంచాని కాను. అందుకే నాకు threats ఎక్కువ. కాబట్టి నేను చెప్పేదేమంటే శుద్ధ్హమైన తెలుగు నా జిహ్వ పై ఎల్లప్పుడూ కదలాడేలా నన్ను ఆశీర్వదించు. నా బ్లాగు నలుగురికి ఆనందం పంచే పోస్టులు రాసేలా ఓ చల్లని చూపు చూడవయ్యా స్వామీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి