మొత్తం పేజీ వీక్షణలు

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

బాలయ్య బాబు వేసిన సూపర్ స్టెప్పు


మీరు బాలయ్య బాబు కి భీభత్సమైన అభిమానులైతే ఇది చదవొద్దని నా విన్నపం. ఆ తరువాత మీ ఇష్టం.




"మంగమ్మ గారి మనవడు" సినిమా చూసారా?  పల్లెటూరి వాతావరణం, అమాయకమనిన మనస్తత్వాలని చూపిస్తూనే పల్లెల్లో పౌరుషాలు, పగల పేరుతో జరిగే ఘోరాలని కూడా ఎర్రని రక్తం రంగరించి మరీ చూపుతుందీ సినిమా. ఈ సినిమాలో భానుమతి నటన అమోఘం.



ఈ సినిమాలో పాటలు మరొక విశేషం. వినడానికి catchy గా కూడా ఉంటాయి. ఆ రోజుల్లో మేనత్త కూతుల్లకో లేక ఎవరైనా ఇష్టమైన అమ్మాయిలకో లైన్ వెయ్యడానికి కుర్రాల్లు వాడిన పాట "దంచవే మేనత్త కూతురా". ఈ పాట వినడానికి ఎంత బావుంటుందో చూడటానికి అంతకంటే ఫన్నీ గా ఉంటుంది. ఈ పాటలో నాకు నవ్వు తెప్పించిన స్టెప్ ని1:25 సె తరువాత ఉంటుంది.
 
 
 
మీరు ఆఫీసు కంప్యూటర్లలో ఈ పాటను చూడలేరు కాబట్టి నాను నచ్చిన ఆ అమోఘమైన స్టెప్ ని GIF picture గా కింద ఇస్తున్నా. ఈ సినిమా కొరియో గ్రాఫర్ ఎవరో గాని ఆ వ్యక్తి ని సన్మానించాలి. వాట్ ఎ క్రియేటివిటీ!!






Balayya_funny2 photo balayya2_zpsac16f7d6.gif

ఇక్కడిదాకా చదివేశారా? మీలో కొందరికి నన్ను దుడ్డు కర్రతో బాదాలని అనిపిస్తుంది కదూ!! కేవలం సరదాకి రాసాను. మరీ టూ మచ్ గా ఫీలైపోకండి. ఐ లవ్ బాలయ్య !!

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఓం బ్లాగ్ గణపతియై నమః

ఓం బ్లాగ్ గణపతియై నమః




ఏమిటి స్వామీ అలా చూస్తున్నావు? కొత్తగా పిలిచాననా? ఏం చెయ్యను? ఒక్కొక్కరూ నిన్ను ఒక్కో రకంగా కాకాపడుతున్నారు. ఎవరెవరో నిన్ను హనుమంతునిమీద, ఎద్దుమీద, హంసమీద ఇంకా తనకి
నచ్చిన జంతువులన్నిటిమీదా ఊరేగిస్తున్నారు. బాగా డబ్బున్నవాల్లేమో నోట్లకట్టలతో అలంకరించి నిన్ను లక్ష్మీగణపతి అంటున్నారు. నువ్వేమో అందరికీ బదులు పలుకుతున్నావుగాని నాకు మాత్రం బదులు
పలకట్లేదు. బహుశా నీకు కొత్తదనం అంటే ఇష్టమేమో అని నేను కూడా ఇలా ప్రయతించాను. నచ్చకపోతే క్షమించు. మా హీరోల తెలుగు డిక్షనరీల్లో ఈ మాట ఉండదేమో కాని, నీ నిఘంటువులో తప్పకుండా
ఉంటుంది. ఎంతైనా భోళా శంకరుని కుమారుడివి కదా. జీన్స్ ఎక్కడికి పోతాయి చెప్పు?!

అయినా ఇన్ని రూపాల్లో దర్శనమిచ్చే నువ్వు మా బ్లాగుల కోసం బ్లాగ్ గణపతిగా వెలిస్తే తప్పేమిటి? మా బ్లాగులకేం తక్కువ? నువ్వు రాసిన మహాభారతం లో ఎన్ని రకాల మనుషులున్నారో మా బ్లాగర్లలో
అన్ని రకాల జనాలూ ఉన్నారు. వ్యాసుని భారతాన్ని నువ్వు అర్థం చేసుకున్నంత సులువుగా ఈ బ్లాగు భారతాన్ని మేం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎవరు ఏ రకమో ఓ పట్టాన అర్థం అవదు. అందులోనూ మా బ్లాగుభారతం లో శల్యులూ శకునులూ ఎక్కువ. మన తరపు ఉన్నట్లుగానే ఉంటారుగానీ సమయం చూసి మనల్ని గోతిలో తోసేస్తారు.

బ్లాగ్ గణపతిగా నీ ఆశీర్వాదం లేకపోతే నా బ్లాగు నిలబడగలదా చెప్పు? విఘ్నాలకి అధిపతివి. ఒక బ్లాగును బ్లాక్ చేయించాలన్నా బ్లాక్-బస్టర్ చేయించాలన్నా నీకు చిటికెలో పని. అన్నట్లు నీ కథలో మూషికాసురుడు ఒక్కడే అయితే మా బ్లాగు వెతల్లో అనానిమాసురులు కోకొల్లలు. ఎవరు ఎపుడు ఎలా దాడిచేస్తారో తెలియదు. అందుకే నీ ఆశీర్వాదం ఇవ్వు స్వామీ. నా బ్లాగు వేసవిలో చల్లగా.. చలికాలంలో నులివెచ్చగా ఉండేట్లు ఆశీర్వదించు. నీకు ఉండ్రాల్లు నైవేద్యం పెట్టలేనుగాని నాకు ఉండ్రాల్లంతే ఎంత ఇష్టమో చెప్తూ ఒక పోస్టు రాయగలను!! ఏమిటి స్వామీ మాట్లాడట్లేదు? తెలంగాణా యాసలో బదులివ్వాలా లేక ఉత్తరాంధ్రయాసలో చెప్పాలా లేక సీమ యాసలో వీడికి గడ్డిపెట్టాలా అని ఆలోచిస్తున్నావా? నాకలాంటి ప్రాంతాల పట్టింపులు లేవు స్వామీ. నేను నీ ఫాన్ ని గాని, ఏ మహానేతకో యువనేతకో హైటెక్కు బాబుకో తెలుగురాని ముఖ్యమంత్రికో ముక్కన్నకో చెంచాని కాను. అందుకే నాకు threats ఎక్కువ. కాబట్టి నేను చెప్పేదేమంటే శుద్ధ్హమైన తెలుగు నా జిహ్వ పై ఎల్లప్పుడూ కదలాడేలా నన్ను ఆశీర్వదించు. నా బ్లాగు నలుగురికి ఆనందం పంచే పోస్టులు రాసేలా ఓ చల్లని చూపు చూడవయ్యా స్వామీ.

2, ఆగస్టు 2013, శుక్రవారం

ఇది సమీప పరిధిలో సీమాంధ్ర ఎదుర్కొనే సమస్యలగురించి ఆలోచించాల్సిన సమయం

విభజన తరువాత శీఘ్ర కాలం లో సీమాంధ్ర ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి?
(1) ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయి (ఈ సమస్య తెలంగాణావారికి కూడా ఉంటుందనుకోండి). విభజన జరిగినా మంత్రుల సంఖ్య తగ్గదు (సంఖ్య తగ్గితే కాంగ్రెస్ నిలబడలేదు). అందుచేత దాదాపుగా ఇంతకుముందు ఉన్న పరిమాణం లోనే ఉన్న ప్రభుత్వానికి, అలాగే కొత్తగా ఏర్పడే ఉన్నతాధికారుల జీతభత్యాల భారం (ఎక్కువ ఖర్చు) తక్కువమంది ప్రజలు భరించాల్సి ఉంటుంది. కాబట్టి పన్నులు పెరిగే అవకాశం ఉంది, లేదా సంక్షేమ పథకాలకి కోతపడే అవకాశం ఉంది. ఈ విషయంలో మన నాయకులు కేంద్రం నుంచి ఎంతవరకూ సాయం రాబడతారో తెరపై చూడాల్సిందే.
(2) విద్యార్థులకు కొంచెం కష్టకాలం. హైదరాబాదు ప్రాంతం లో ఉన్న కళాశాలల్లో కొన్నాల్లవరకైన ప్రవేశాలు దొరుకుతాయో లేదో చూడాలి. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్న కొన్నాళ్ళవరకైనా ఆ ప్రాంత
కళాశాలలలో విద్యార్థులకు అవకాశం ఉండాలి. ఈ విషయం లో ప్రభుత్వ స్పష్టత అవసరం. ఈలోగా అంధ్రా/వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలను మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. రాజ్య నిర్మాణానికి
నిపుణులైన వ్యక్తులు తయారవ్వాలంటే విద్య కీలకం. ఈ విషయం మన నాయకులు మర్చిపోయినా విద్యార్థులు, యువత మాత్రం తప్పని సరిగా గుర్తుంచుకోవాలి.
(3) ఇక మిగిలింది ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఇప్పటికే ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడో ఒకదగ్గర వాల్లని కూర్చోబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. లేకపోతే
పోరాడటానికి వాళ్ళకి సంఘాలు ఎలాగూ ఉన్నాయి. కొంతమందికి స్థాన చలనం తప్పకపోవచ్చు. దానికి సిధ్ధపడాలి. ఇక ప్రైవేటు ఉద్యోగాలు. ప్రైవేటు కంపెనీలకి కావలసింది పనితనమే కాని ప్రాంతాలతో పని
లేదు. ఇవాల చెన్నై/పూనే/బెంగలూరు/బొంబాయి లాంటి నగరాలలో తెలుగువారు పనిచేయటం లేదా. అటువంటపుడు హైద్రరాబాదులో ఎందుకు పని చెయ్యలేరు? ఖచ్చితంగా చెయ్యగలరు. నైపుణ్యం
ఉన్నవారిని విభేదాలు వివాదాలతో తరిమేస్తే అది కంపెనీకే నష్టం అవుతుంది. అటువంటపుడు కంపెనీ మూతపడటమో లొకేషన్ మార్చుకోవటమో చెయ్యక తప్పదు. అందుచేత నేను చెప్పేదేమిటంటే
(ముఖ్యంగా విద్యార్థులకు) తమ నైపుణ్యం (skills) పెంచుకోవటం ద్వారా ప్రైవేటు ఉద్యోగాలు సాధించుకోవాలి. గత కొన్నేళ్ళుగా ప్రభుత్వమూ మనకి ఉద్యోగాలు ఇచ్చింది ఎలాగూ లేదు. ప్రైవేటు ఉద్యోగాలే గతి అవుతున్నాయి.

long term లో సీమాంధ్ర అభివృధ్ధికి ఉన్న అవకాశాలు మరో టపాలో.

1, ఆగస్టు 2013, గురువారం

ఇది రాష్ట్రం ముక్కలయ్యిందని బాధపడాల్సిన తరుణమా?

తెలంగాణా నిర్ణయం జరిగిపోయింది. తెలంగాణేతర ప్రాంతంలో పరిస్థితులు ఇపుడు అట్టుడుకుతున్నాయి. అయితే ఈ ఆందోళనలు అరణ్య రోదనలే అవుతాయి తప్ప వాటివల్ల ఉపయోగం ఉండదు. తమ పార్టీ నేతలు చెప్తేనే వినని అధినేత్రికి ఈ ఆందోళనలు ఒక లెక్కా? కానే కాదు. అందుచేత ఇపుడు భావావేశాలని ప్రదర్శించి తరువాత చల్లబడిపోవటం కన్నా, ఎన్నికలవరకూ ఈ ఆవేశాన్ని మనసులోనే ఉంచుకుని
వోటు ద్వారా మన దెబ్బ ఏమిటో స్వార్థ రాజకీయ నాయకులకు రుచి చూపిస్తే బావుంటుంది.

చరిత్రనుంచి పాఠాలు నేర్చుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం కనుక ఈ సంఘటన కు సంబంధించిన కొన్ని విషయాలను గమనిద్దాం.
(1) ప్రత్యేక రాష్ట్రం కొరకు జరిగినంత ఘాటుగా సమైక్య ఉద్యమాలు జరగలేదు. దాని అర్థం సీమాంధ్రులు సమైక్య రాష్ట్రాన్ని బలంగా కోరుకోవట్లేదని తెలంగాణా నాయకులు బాగా ప్రచారం చేశారు. సీమాంధ్రుల్లో రాష్ట్రం ఒకటిగా ఉండాలనే కోరిక ఉంటూనే తమ జీవితాన్ని తామే మెరుగుపరచుకోవాలనే భావన కూడా ఉంది. అందుకే ఎవరి పని వారు చేసుకున్నారు.
(2) నాయకుల రెచ్చగొట్టే మాటలను తెలంగాణా ప్రజలు బాగా విశ్వసించారు. ఎవరికైనా "తమ పేదరికానికి మరెవరో కారణం" అని చెప్పే మాటలు బాగా నచ్చుతాయి. గొప్పగా వర్ధిల్లుతున్న రుద్రాక్ష వ్యాపారాలు, మంత్ర తంత్రాలే దీనీకి ఉదాహరణ. కాబట్టి సహజంగానే తెలంగాణా ప్రజలు నాయకుల వలలో పడ్డారు. ఉద్యమాల్లో విరివిగా పాల్గొన్నారు. ఈ విషయం లో సీమాంధ్రవారిదీ కొంత పాత్ర ఉంది. కొంతమంది కేవలం తమ ఊరివాడికో తమ ప్రాంతం వాడికో అన్నీ దక్కేలా చూడటం, అందుకోసం కొన్నిసార్లు అవతలివారిని అణచివెయ్యటం కూడా జరుగుతుంది. ఇటువంటి భావజాలం అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ కొద్దో గొప్పో ఉన్నా కొన్నిసార్లు సీమాంధ్రులు ఇలాంటి లక్షణాలని బహిరంగంగా ప్రదర్శించటం జరిగింది. ఒక్క వ్యక్తిపై వివక్ష చూపించినా అది వందమందికి ప్రసారం చేయబడే రోజులివి. అందుచేత కొద్దిమంది సీమాంధ్రులు చూపిన  విపరీతాభిమానం కూడా నేడు జాతికి శాపంగా పరిణమించాయి.
(3) సీమాంధ్ర పెట్టుబడిదారులు దోపిడీదారులు దొంగలు అంటూ KCR విరుచుకుపడ్డారు. ఆయన మాటలనే పరిగణనలోకి తీసుకుంటే సొంత ఊరిని వదిలి డబ్బంతా హైదరాబాదులో పెట్టినవారినేం అనాలి. ఇది అత్యాశ కాదా? నిజానికి నగరాల్లో పెద్ద పెద్ద ఆస్థులు ఉన్నవి (ఎక్కువగా) అప్పనంగా దోచుకున్న నాయకులకే. కాని దాని పాపం, నింద మోస్తోంది మాత్రం ఒక ప్రాంతానికి చెందిన సామాన్య ప్రజలు. ఎందుకిలా? ఓటుకు వందో వెయ్యో తీసుకున్న ఫలితమా? ఎన్ని తప్పులు చేసినా మనకులపువాడే కదా అని ఉపేక్షించిన గజ్జి గుణం ఫలితమా?

జరిగిపోయిన దాన్ని తలచుకుంటూ తలకాయో గుండెకాయో కొట్టుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. జరిగేది ఏదైనా మన మంచికే అన్నారు పెద్దలు. ఇపుడు తెలంగాణేతర ప్రాంతాన్ని కూడా అభివృధ్ధిచేసుకునే అవకాశం ఉంది. దాని గురించి మరో టపాలో.


12, ఏప్రిల్ 2013, శుక్రవారం